July 14, 2011

మన ప్రేమ

రచన: బాలాంత్రపు రజనీకాంతరావు
స్వరకల్పన: బాలాంత్రపు రజనీకాంతరావు
పాడినది: శ్రీరంగం గోపాలరత్నం, మంగళంపల్లి బాలమురళికృష్ణ

ప్రేమికుల ఆశలు, ఆందోళనలకు అద్దం పట్టే పాట ఇది.Audio - శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారి సౌజన్యంతో.


మన ప్రేమ, మన ప్రేమ!


సత్య సౌందర్య భూములలో ప్రభవించి, ప్రభవించి
- నమ్రమరుసీమమగునో!
- కమ్రసుమధామమగునో!


కల్లొలినీ తరంగములన్ పయనించి, పయనించి
- కీర్ణసికతాద్రియగునో!
- పూర్ణకలశాబ్ధియగునో!


కాలగాఢాగ్నికీలలలో తపియించి, తపియించి
- దగ్ధతరుకాండమగునో!
- ముగ్ధమధుభాండమగునో!

ప్రభవించి : పుట్టి; ప్రభవించి : పెరిగి; నమ్రమరుసీమ : నమ్ర + మరు + సీమ - తుచ్చమైన ఎడారి; కమ్రసుమధామము: కమ్ర (అందమైన) + సుమధామము (పూదోట); కల్లొలినీ: నది; పయనించి: ప్రయాణానికి సిద్ధమై; పయనించి: ప్రయాణించి; కీర్ణసికతాద్రియగునో:కీర్ణ (కప్పబడి) + సికతాద్రి (ఇసుకదిబ్బ) + అగునో - ఇసుకదిబ్బలచే కప్పబడిపోవునో; పూర్ణకలశాబ్ధియగునో: పూర్ణ + కలశ + అబ్ధి + అగునో - సముద్రంలో కలిసిన నది వలె సంపుర్ణమగునో; తపియించి: బాధపడి; తపియించి: తపస్సు చేసి; దగ్ధతరుకాండమగునో: కాలి మోడైపోవునో; ముగ్ధమధుభాండమగునో: ముగ్ధ (అందమైన) + మధుభాండము (తేనెలు గలది) - అనగా అందమైన పూలచెట్టు గా మారునో

June 5, 2011

కడచేనటే సకియా, ఈ రాతిరి

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
స్వరకల్పన: వోలేటి వెంకటేశ్వర్లు
పాడినది: వోలేటి వెంకటేశ్వర్లు

ఇది ద్వంద్వార్థం కలిగిన పాట. నాయిక విరహం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ, అసలు అర్థం సాధకుడి ఆధ్యాత్మిక వేదన వ్యక్తం చేస్తుంది.

దీని పుట్టుక గురించి మహాభాష్యం చిత్తరంజన్ గారి పుస్తకం లో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు - ఆయన మాటల్లోనే చదవండి:

ఈ పాట ఆవిర్భావించటానికి ప్రేరణ కలిగించిన సందర్భం 1964 లో జరిగింది. అ సంవత్సరం జూలై ప్రాంతంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు స్థానిక రవీంద్ర భారతిలో ప్రదర్శించటానికి వర్షఋతువుకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. విజయవాడ కేంద్రం లో ప్రొడ్యుసర్ గా ఉన్న శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగానే నేను శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇంటిలో ఉండగా వోలేటి గారక్కడికి వచ్చారు.

అదే సమయం లో కృష్ణశాస్త్రి గారి కుమారుడు శ్రీ బుజ్జాయి తను కొత్తగా కొని తెచ్చుకున్న హిందుస్తాని ఎల్పీ రికార్డును పక్క గదిలో వింటుండగా శాస్త్రిగారి వద్ద కూర్చున్న మా చెవులలో పడింది. అందరం అ గది లోకి వెళ్లి విన్నం. అది పాకిస్తాన్ లోని విద్వాంసులు సలామత్ అలీ, నజాకత్ అలీ గానం చేసిన పహాడీ రాగపు ఠుమ్రి - "సయ్యా బిన్ ఘర సునా". వోలేటి వారు నాలుగైదు సార్లు అ రికార్డు పదే పదే వేయించుకు విని పరవశులైపోయారు.

హిందుస్తాని సంగీతం లో కుడా మహా విద్వాంసులైన వోలేటి గారు అ పారవశ్యంలో అరగంట సేపు పహాడీ రాగం ఆలపించారు. కృష్ణశాస్త్రి గారు తానొక పాట వ్రాస్తానని, వోలేటి గారిని బాణీ కట్టమని అడిగారు. వెంటనే వోలేటి గారు స్పందించగా రూపొందిన సుమధుర గేయమే ఈ "కడచేనటే సకియా ఈ రాతిరి". రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమం లో వోలేటి ఈ పాటను అద్భుతంగా గానం చేశారు.Audio - శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారి సౌజన్యంతో.

చిత్తరంజన్ గారు చెప్పిన ఎల్పీ రికార్డు - ఇదే:
కడచేనటే సకియా, ఈ రాతిరి
కడుభారమైన ఎడబాటున
అయ్యయ్యో!

ఈ మేఘవేళ ఏమోకదే చెలియా!
స్వామి దవ్వైన, నిదుర రాదాయెనే
అయ్యయ్యో!

ఈ కడిమివోలె ఎదురుచూచేనే సకియా!
ఏకాకి నా బ్రతుకు చేదాయెనే
అయ్యయ్యో!

మేఘవేళ: మబ్బు పట్టి ఉన్న వేళ - మాయ కమ్మియున్న వేళ; ఏమొకదే: ఎమీ + ఓకదే (కనిపించదే); దవ్వైన: దవ్వు (దూరం) + అయిన; కడిమి: పచ్చిక బయలు - "కడిమివోలె ఎదురుచూచేనే" అంటే స్వామి పాదస్పర్శకై ఎదురుచూస్తున్నాను అని భావార్థం - ఇక్కడ "కడిమి" అనే పదం "కడిమిడి" కి రూపాంతరం అని నా అభిప్రాయం (చూ|| బ్రౌణ్యం)

May 30, 2011

అందాల ఆమనీ! ఆనందదాయనీ!


రచన:  ???
స్వరకల్పన: మల్లాది సూరిబాబు or కలగా కృష్ణ మోహన్
పాడినది: విజయలక్ష్మిAudio - శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారి సౌజన్యంతో.


అందాల  ఆమనీ!  ఆనందదాయనీ!
అరుదెంచినావటే అప్సరాగామినీ!

గండుకోయిల నీదు గళమందు పాడినది
నిండు పండువ నీదు గుండెలో దాగినది

పువ్వులే నవ్వులుగా పులకించిపోదువా?
నవ్వులే వెన్నెలగా నన్ను మురిపింతువా?

యుగయుగాలుగా కవుల ఊరించు రసధునీ!
మధురార్ద్రహృదయినివే మాధవుని భామిని


May 20, 2011

స్వతంత్రభారతజననీ! నీకిదే నితాంత నవనీరాజనము

రచన:  బాలాంత్రపు రజనీకాంతరావు
స్వరకల్పన: బాలాంత్రపు రజనీకాంతరావు
పాడినది: శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, రామడుగు లక్ష్మీనారాయణవరప్రసాద శాస్త్రి, యమ్వీ రమణమూర్తి, తదితరులు


స్వతంత్రభారతజననీ! నీకిదే
నితాంత నవనీరాజనము
అశేష పుజాశిరీషములతో
అగణిత నరనారీ జనము

వదలెను చిరదాస్యశృంఖలమ్ములు
చెదరెను దైన్య-తమ:పటలమ్ములు
ఆసేతుహిమనగమ్మొక పొంగై
అలముకొన్నదానందతరంగము

పచ్చనితోటలనేయెడవినిన
స్వేచ్ఛాపికముల నిండుగళమ్ములు
హాయిహాయిగా రెక్కలు విద్రుచే
తీయని గీతిక హారతులే

త్యాగమూర్తియౌ మహాత్ముడొసగిన
శాంత్యహింసలే సదాశయములుగ
సకల వసుంధరనేకముసేయగ
అకలంకులమై ప్రతినలు సేతుము

పచ్చనితోటలనేయెడవినిన: పచ్చని తోటలలో ఏ ఎడ (ఎక్కడ) విన్నా; విద్రుచే: విదిలించే; అకలంకులమై: కళంకము లేని వారమై

May 19, 2011

నా దేశం - నవ్వుతున్న నందనాల సుమగీతం

రచన:  మంగళగిరి ఆదిత్యప్రసాద్
స్వరకల్పన: అనిపిండి (రామడుగు) మీనాక్షి
పాడినది: ???
శ్రీమతి అనిపిండి మీనాక్షి గారికి కృతజ్ఞతలతో.


నా దేశం - నవ్వుతున్న నందనాల సుమగీతం
నా దేశం - వేదంలా తారాడే సంగీతం
నవయువకుల నాడినుండి, నవశక్తుల నీడనుండి,
ఎదలూయలలూగుతున్న ఉదయకాంతి జలపాతం

యుగాలైన కరగిపోని ఘనతకిల్లు నా దేశం!
యుగకర్తల, సంస్కర్తల, ఘనులకిల్లు నా దేశం!
అడుగడుగున సందేశం, అణువణువున ఆవేశం!
నా భారత దేశానికి సాటి రాదు ఏ దేశం!

కులమతాల కోకిలలకు గున్నమావి నా దేశం!
బాధితులను ఓదార్చే బోధితరువు నా దేశం!
మురిపించే దరహాసం, మరపించే మధుమాసం!
ధరకంతకు ప్రాణమిచ్చు సురభోజం నా దేశం!

సురభోజం: దేవతల రాజ్యం

May 18, 2011

కలగంటిని, నేను కలగంటిని

రచన: మధురాంతకం రాజారామ్
స్వరకల్పన: ???
పాడినది: రామడుగు లక్ష్మీనారాయణవరప్రసాద శాస్త్రి (ఆకాశవాణి - విజయవాడ కేంద్రం)

లక్ష్మీనారాయణవరప్రసాద శాస్త్రి గారి కుమార్తె శ్రీమతి అనిపిండి మీనాక్షి గారికి కృతజ్ఞతలతో.


కలగంటిని, నేను కలగంటిని
కలలోన తల్లిని కనుగొంటిని

మెడలోన అందాల మందారమాల,
జడలోన మల్లికాకుసుమాల హేల!
ఆ మోములో వెల్గు కోటి దీపాలు,
ఆ తల్లి పాదాలు దివ్యకుసుమాలు!

కంచి కామాక్షియా? కాకున్న, ఈమె
కాశీ విశాలాక్షి కాకూడదేమి?
కరుణించి చూసెనా, వెన్నెలలు కురియు!
కన్నెర్ర జేసెనా, మిన్నులే విరుగు!

పోల్చుకున్నానులే, పోల్చుకున్నాను!
వాల్చి మస్తకము, నే ప్రణమిల్లినాను!
అనుపమానాలోక్య భాగ్యస్తమోపేత
ఆమె ఎవరో కాదు, భారతమాత!

మిన్ను: ఆకాశం; మస్తకము: నుదురు; ప్రణమిల్లినాను: దణ్ణం పెట్టాను; అనుపమానాలోక్య భాగ్యస్తమోపేత: అనుపమాన + ఆలోక్య + భాగ్యస్తమోపేత = చూసి ఆనందించడమే తప్ప చెప్పనలవిగాని భాగ్యములు కల్గిన

April 14, 2011

ఊరు లేని పొలిమేర, పేరు-పెంపు లేని బదుకు, గారవంబులేని ప్రియము, కదియనేటికే?

రచన: అన్నమయ్య

కల్లూరి మురళీకృష్ణ గారు ఈ పాటకి వరస కట్టి పాడారు కానీ అది ఏమాత్రమూ పండలేదు. బాలమురళిగారు చెప్పినట్టు, ఎంతోమంది అన్నమయ్య పదాలకు వరసలు అమర్చారు కానీ, అవి ఆలోచనామృతములుగానే మిగిలిపోయాయి; ఆపాతమధురాలు కాలేదు. ఈ పాట కూడా ఆ కోవలోనే జేరింది - ప్రస్తుతానికి.


ఊరు లేని పొలిమేర, పేరు-పెంపు లేని బదుకు,
గారవంబులేని ప్రియము, కదియనేటికే?

ఉండరాని విరహవేదనయుండని సురతసుఖమేల?
ఎండలేనినాటి నీడ ఏమి సేయనే?
దండిగలుగుతమకమనేటి దండలేని తాలిమేల?
రెండునొకటిగాని రచనప్రియములేటికే?

మెచ్చులేనిచోటు ఎంత మేలు కలిగినేమి శెలవు
మచ్చికలేనిచోట మంచి మాటలేటికి?
పెచ్చు-పెరుగు లేనిచోటబ్రియము కలిగినేమి ఫలము?
ఇచ్చలేనినాటి సొబగులేమిసేయనే?

బొంకులేనిచెలిమిగాని పొందులేల మనసులోన?
శంకలేకగదియలేని చనవులేటికే?
కొంకు-కొసరు లేని మంచి కుటమలరనిట్లగూడి
వేంకటాద్రి విభుడులేని వేడుకేటికే?

ఊరు లేని పొలిమేర: ఊరు లేనప్పుడు/లేనిచోట  పొలిమేర; గారవంబు: గారం; కదియ: కలియ; ఉండరాని విరహవేదన: అలవిగాని విరహవేదన; దండి: సమృద్ధి; తమకము: అనురక్తి; తాలిమి: ఓర్పు, క్షమ; మచ్చిక: ప్రేమ; రచనప్రియము: తెచ్చిపెట్టుకున్న (కృతికమైన) ప్రేమ, కల్లబొల్లి కబుర్లు; మంచి: మిక్కిలి (మచ్చికలేని చోట మంచి మాటలు వద్దంటే అర్ధం తగవులాడమని కాదు,అవసరానికి మించి మాట్లాడ వద్దని); కొంకు-కొసరు లేని: ఏ మాత్రం భయము, సంకోచము లేని

February 9, 2011

చల్లగాలిలో యమునాతటిపై శ్యామసుందరుని మురళి

రచన: బాలాంత్రపు రజనీకాంత రావు
స్వరకల్పన: సాలూరు రాజేశ్వర రావు
పాడినది: సాలూరు రాజేశ్వర రావు

ఆలోచనామృతమును ఆపాతమధురంగా అందించగల బయకారులలో ఎన్నదగిన వ్యక్తి రజనీకాంతరావు గారు. ఆయన్ని గురించి తెలుసుకోవాలంటే అజో-విభొ-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా వైజయంతి చదవండి.
చల్లగాలిలో యమునాతటిపై
శ్యామసుందరుని మురళి!
మురళి, శ్యామసుందరుని మురళి

ఉల్లము కొల్లగొనే మధుగీతులు
మెల్లమెల్ల చెవి సోకునవే
చల్లగాలిలో!

తూలి వ్రాలు వటపత్రమ్ములపై
తేలి తేలి పడు అడుగులవే!
పూలతీవ పొదరిల్లు మాటు గా
పొంచిచూచు శిఖి పింఛమదే
చల్లగాలిలో!

తరువు తరువు కడ డాగి డాగి
నన్నరయు కన్నుగవ మురుపులవే
మురిసి మురిసి, నా వెనుక దరిసి
కనుమూయు చివురు కెంగేళులివే
మూయు చివురు కెంగేళులివే
చల్లగాలిలో యమునాతటిపై
శ్యామసుందరుని మురళి!
మురళి, శ్యామసుందరుని మురళి

అరయు: గమనించు; డాగి: దాగి; కన్నుగవ: కనుదోయి, (రెండు) కళ్ళు; మురుపు: సంతోషాతిశయము; కెంగేలు: కెంపు+కేలు - అరచెయ్యి

February 1, 2011

నీలాలు కారేనా, కాలాలు మారేనా

చిత్రపటము: ముద్దమందారం (1981)
రచన: వేటూరి సుందర రామ  మూర్తి
స్వరకల్పన: రమేష్ నాయుడు
పాడినది: ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం
నీలాలు కారేనా, కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా?
జాజి పూసే వేళ, జాబిల్లి వేళ
పూలడోల నేను కానా
నీలాలు కారేనా, కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా
జాజి పూసే  వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా

సూరీడు, నెలరేడు
    - సిరిగల దొరలే కారులే,
పూరిగుడిసెల్లో, పేదమనస్సులో
   - వెలిగేటి దీపాలులే!
ఆ నింగి, ఈ నేల
   - కొనగల సిరులే లేవులే,
కలిమి లేముల్లో కరిగే ప్రేమల్లో
   - నిరుపేద లోగిళ్ళులే

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా
జాజి పూసే  వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో,
కలికి వెన్నెల్లో
   - కలల కన్నుల్లో కలతారిపోవాలిలే
ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో
ఒడిలో నీవుంటే, ఒదిగి పోతుంటే
   - కడతేరి పోవాలిలే

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా
జాజి పూసే  వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా
జాజి పూసే  వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా

డోల: ఉయ్యాల బల్ల; వెత: వ్యథ; కలతారిపోవాలి: కలత + ఆరిపోవాలి (క్షోభ ఉపశమించాలి); కడతేరి: ఇక్కడ జీవితం గడిచిపోవాలనే అర్థం లో వాడబడింది. "కడతేరి" అంటే "సఫలమయ్యి" అని కూడా అర్థం ఉంది (బ్రౌణ్యం) - ఆ అర్థం కూడా పొసుగుతుంది.

January 30, 2011

భారతరత్న భీమసేన్ జోషి

నిన్నటి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారి గానసుధ తెలుగు రేడియో కార్యక్రమంలో భారతరత్న భీమసేన్ జోషి గారికి నేను, భాస్కర్ గారు వేసిన నూలుపోగు. తెలుగు పాట కాకపోయినా, ఇది ఈ బ్లాగ్ చదివే వారి అభిరుచులకు తగినదనే నా ఊహ.