February 9, 2011

చల్లగాలిలో యమునాతటిపై శ్యామసుందరుని మురళి

రచన: బాలాంత్రపు రజనీకాంత రావు
స్వరకల్పన: సాలూరు రాజేశ్వర రావు
పాడినది: సాలూరు రాజేశ్వర రావు

ఆలోచనామృతమును ఆపాతమధురంగా అందించగల బయకారులలో ఎన్నదగిన వ్యక్తి రజనీకాంతరావు గారు. ఆయన్ని గురించి తెలుసుకోవాలంటే అజో-విభొ-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా వైజయంతి చదవండి.




చల్లగాలిలో యమునాతటిపై
శ్యామసుందరుని మురళి!
మురళి, శ్యామసుందరుని మురళి

ఉల్లము కొల్లగొనే మధుగీతులు
మెల్లమెల్ల చెవి సోకునవే
చల్లగాలిలో!

తూలి వ్రాలు వటపత్రమ్ములపై
తేలి తేలి పడు అడుగులవే!
పూలతీవ పొదరిల్లు మాటు గా
పొంచిచూచు శిఖి పింఛమదే
చల్లగాలిలో!

తరువు తరువు కడ డాగి డాగి
నన్నరయు కన్నుగవ మురుపులవే
మురిసి మురిసి, నా వెనుక దరిసి
కనుమూయు చివురు కెంగేళులివే
మూయు చివురు కెంగేళులివే
చల్లగాలిలో యమునాతటిపై
శ్యామసుందరుని మురళి!
మురళి, శ్యామసుందరుని మురళి

అరయు: గమనించు; డాగి: దాగి; కన్నుగవ: కనుదోయి, (రెండు) కళ్ళు; మురుపు: సంతోషాతిశయము; కెంగేలు: కెంపు+కేలు - అరచెయ్యి

No comments: