January 30, 2011

భారతరత్న భీమసేన్ జోషి

నిన్నటి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారి గానసుధ తెలుగు రేడియో కార్యక్రమంలో భారతరత్న భీమసేన్ జోషి గారికి నేను, భాస్కర్ గారు వేసిన నూలుపోగు. తెలుగు పాట కాకపోయినా, ఇది ఈ బ్లాగ్ చదివే వారి అభిరుచులకు తగినదనే నా ఊహ.



January 28, 2011

జన్మభూమి (ఏ దేశమేగినా)

రచన: రాయప్రోలు సుబ్బారావు

ఇది రికార్డు గానో, ఆకాశ వాణి లో పాట గానో వచ్చిందేమో తెలియదు - తెలిసిన వాళ్ళెవరైనా చెప్పండి, ఇక్కడ వ్రాస్తాను... పాట mp3 పంపిస్తే మరి సంతోషం!


ఏ దేశమేగినా, ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని!
నిలుపరా నీ జాతి నిండు గౌరవము!

లేదురా ఇటువంటి భూదేవి ఎందు,
లేరురా మనవంటి పౌరులింకెందు!

ఏ పూర్వపుణ్యమో, ఏ యోగబలమో,
జనియించినాడవీ స్వర్గలోకమున
ఏ మంచిపూవులన్ బ్రేమించినావో
నిను మోసెనీతల్లి కనకగర్భమున

సూర్యుని వెలుతురు సోకునందాక -
ఓడలన్ జెండాలు ఆడునందాక -
నరుడు ప్రాణాలతో నడచునందాక -
అందాక గల ఈయనంతభూతలిని
మనభూమి వంటి కమ్మని భూమిలేదు!

తమ తపస్సులు ఋషుల్ ధారబోయంగ,
చండవీర్యము శూరచంద్రులర్పింప,
రాగదుగ్ధము భక్తరాజులీయంగ,
భావసూత్రము కవిబాంధవులల్ల,
దిక్కులకెగదన్ను తేజంబు వెలుగ,
జగములనూగించు మగతనంబెగయ,
రాలు పూవులు సేయు రాగాలు సాగ,
సౌందర్యమెగబోయు సాహిత్యమొప్ప;

వెలిగినదీ దివ్యవిశ్వంబు పుత్రా!
దిపించెనీ పుణ్యదేశంబు పుత్రా!

అవమానమేలరా? అనుమానమేల?
భారతపుత్రుడాయంచు భక్తితోబలుక!

January 18, 2011

జయ భారతావనీ! జయ లోకపావనీ! (జయ గీతి)

రచన;వానమామలై వరదాచార్యులు
స్వరకల్పన: నూకల చిన్న సత్యనారాయణ
పాడినది: ?


జయ భారతావనీ! జయ లోకపావనీ!
శాంతి సుఖదాయినీ! జననీ, నమస్తే!

సకల సంపత్ఖనీ! సస్య నందనవనీ!
ఆసేతుశీతనగహాటకావనీ! జననీ!

నీ మహోన్నతి - హిమానీగోత్ర శిఖరం
నీ పవిత్రత - గాంగనిర్ఝర ప్రవాహం
నీ చేతి సొమ్ము - ఎల్లోరా శిల్పఖండమ్ము
నీదు వాక్యమ్ము - శ్రీ గీతోపదేశం!


జయ భారతావనీ! జయ లోకపావనీ!
శాంతి సుఖదాయినీ! జననీ, నమస్తే!
ఆసేతుశీతనగహాటకావనీ: ఆసేతు + శీతనగ + హాటక + అవనీ - రామేశ్వరం (సేతు) నించి హిమాలయ పర్యంతంగా గల బంగరు (హాటక) భూమి;
హిమానీగోత్ర: గంగోత్రి; గాంగనిర్ఝర: గంగా నది

January 16, 2011

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
స్వరకల్పన: పాలగుమ్మి విశ్వనాథం (?)
పాడినది: బృందం
ఆకాశవాణి ఆణిముత్యం - గుర్తు చేసిన మిత్రుడు డొక్కా ఫణికుమారునికి కృతజ్ఞతలతో 

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఎల్లరికనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో


కొండదిగీ కోన దిగీ గుబురు అడవి కొమ్మలను దిగీ
ఉండి ఉండి ఒక ఇన కిరణమ్ము ఉర్వి ప్రభాతమ్ము నింపగా

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో


ఊరక చీకటి యవనిక లో ఒక్క క్షణం దాచారో ఎవరో
వారిక తారక దీపికనూ ఆరుపనేరుతురో ఎవరో

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో


ఈ సత్యాన్వేషికి, ఈ మితభాషికి ఎంత కాలమీ బంధన?
ఈ అసత్యాలలో దైవానికి ఎంత కాలమీ శోధన?


తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఎల్లరికనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో

ఇన కిరణము: సూర్య కిరణము; ఉర్వి: భూమి; యవనిక: తెర చీర, పరదా;

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి

రచన: పాలగుమ్మి విశ్వనాథం
స్వరకల్పన: పాలగుమ్మి విశ్వనాథం
పాడినది: పాలగుమ్మి విశ్వనాథం




పంట చేల గట్ల మీద నడవాలి
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

ఒయ్యారి నడకలతో ఆ ఏరు,
ఆ ఏరు దాటితే మా ఊరు!
ఊరి మధ్య కోవెల, కోనేరు
ఒకసారి చూస్తిరా తిరిగి పోలేరు!
ఊరి మధ్య కోవెల, కోనేరు
ఒకసారి చూస్తిరా వదిలి పోలేరు!

పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి
ఏరు దాటి తోట తోపు తిరగాలి
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి

చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి
మనసువిప్పి మాట్లాడే మనుషులు కలవాలి
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి
ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి

పంట చేల గట్ల మీద నడవాలి
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి

January 14, 2011

తరలి రారమ్మా!

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
స్వరకల్పన: నూకల చిన్న సత్యనారాయణ ?

ఈ పాట రికార్డింగ్ నేనెప్పుడూ వినలేదు - మా అమ్మకి చిన్నసత్యనారాయణ గారు గురువు; అయన దగ్గర మా అమ్మ నేర్చుకుంది; నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను.

తరలి రారమ్మా! తరలి రారమ్మా!
గౌతమీ, మంజీర, ఓ నాగావళీ, ఓ వంశధారా,
తుంగభద్ర, పినాకినీ, ఉత్తుంగ భంగా కృష్ణవేణీ!
తరలి రారమ్మా! తరలి రారమ్మా!

నురుగుల ముత్యాల చెరగుల, తరగ మడతల పావడాతో
తురిమి సిగలో రెల్లు పూమంజరులు ఝారులౌ సోయగముతో
తరలి రారమ్మా! తరలి రారమ్మా!

ఆవలి దరి ఎలమావి తోపులు, ఇవలి దరి వరిచేల కోపులు
ఆవల ఈవల చూచుచూ, తలలూచుచూ, రాయంచ నడకల
తరలి రారమ్మా! తరలి రారమ్మా!

చెరగు: అంచు; తరగ: అల; మంజరి: చిగిరించిన లేతకొమ్మ, పూలగుత్తి, పెద్ద ముత్యము; ఝరి: సెలయేరు; సోయగము: అందము;  ఎల: లేత; వరి కోపులు: వరి మడులు; రాయంచ: రాజహంస

January 12, 2011

బంగారు పాపాయి

రచన: మంచాల జగన్నాథ రావు
స్వరకల్పన: సాలూరు రాజేశ్వర రావు
పాడినది: రావు బాలసరస్వతి

జగన్నాథ రావు గారు బాలసరస్వతి గారి కూతురి పుట్టినరోజు సందర్భంగా వ్రాసిన పాట.




బంగారు పాపాయి బహుమతులు పొందాలి,
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు

పలు సీమలకు పోయి, తెలివిగల పాపాయి
కళలన్ని చూపించి ఘనకీర్తి పొందాలి
ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి!

బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు

మా పాప పలికితే మధువులే కురియాలి!
పాపాయి పాడితే పాములే ఆడాలి!
మా పాప పలికితే మధువులే కురియాలి!
పాపాయి పాడితే పాములే ఆడాలి!
ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప?
ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి,
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు

బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు


తెనుగుదేశము నాది, తెనుగు పాపను నేను
అని పాప జగమంతా చాటి వెలయించాలి,
మా నోములపుడు మాబాగా ఫలియించాలి!

బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు