January 16, 2011

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి

రచన: పాలగుమ్మి విశ్వనాథం
స్వరకల్పన: పాలగుమ్మి విశ్వనాథం
పాడినది: పాలగుమ్మి విశ్వనాథం




పంట చేల గట్ల మీద నడవాలి
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

ఒయ్యారి నడకలతో ఆ ఏరు,
ఆ ఏరు దాటితే మా ఊరు!
ఊరి మధ్య కోవెల, కోనేరు
ఒకసారి చూస్తిరా తిరిగి పోలేరు!
ఊరి మధ్య కోవెల, కోనేరు
ఒకసారి చూస్తిరా వదిలి పోలేరు!

పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి
ఏరు దాటి తోట తోపు తిరగాలి
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి

చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి
మనసువిప్పి మాట్లాడే మనుషులు కలవాలి
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి
ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి

పంట చేల గట్ల మీద నడవాలి
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి

No comments: