September 24, 2007

గాలిలో నా బ్రతుకు

రచన: రతన్ రావు
స్వరకల్పన: ఘంటసాల
పాడినది: ఘంటసాల

ఇది ఘంటసాల గారి మొట్టమొదటి సోలో రికార్డింగ్.




గాలిలో...

గాలిలో నా బ్రతుకు
తేలిపోయినదోయి
నీలిలో కలసింది
మాలి! నా బ్రతుకోయి!
గాలిలో...

పంచభూతములార!
రాయంచ, గిరులార!
నా పంచ జేరరే!
పలుకరింపగ రారే!
గాలిలో...

రావోయి, రావోయి
నా దరికి రావోయి
ఆరిపోవునో ఏమో
నా చిన్ని వెలుగోయి
నా చిన్ని వెలుగోయి
గాలిలో...

కరుణ ఎరుణా లేని
కాలదేవతనుండి
కాపాడ రావోయి
గాలిలో నా బ్రతుకు
కరుణ ఎరుణా లేని
కాలదేవతనుండి
కాపాడ రావోయి
గాలిలో నా బ్రతుకు
నిలుపంగ రావోయి
గాలిలో నా బతుకు!
గాలిలో నా బ్రతుకు
తేలిపోయినదోయి
నీలిలో కలసింది
మాలి! నా బ్రతుకోయి!

గాలిలో...

రావోయి బంగారిమావా!

రచన: కొనకళ్ళ వెంకటరత్నం (బంగారిమావ పాటలు)
స్వరకల్పన: ఘంటసాల
పాడినది: ఘంటసాల

వెంకటరత్నం గారు రాసిన పాటలో మూడు చరణాలు మాత్రమే ఘంటసాల గారు పాడారు.
ఘంటసాల "వగ" అని పాడారని డొక్కా ఫణి వ్యాఖ్య. నిజమే. "సొద", "వగ" "చింత" కు పర్యాయపదాలే కాబట్టి అర్థ గౌరవం తగ్గదు; కానీ "సొద" కి  "సోది" అనే (అనైఘంటిక) విపరీతార్థమే ఎక్కువ ప్రాచుర్యం పొంది ఉండటం వల్ల ఘంటసాల "వగ" అని పాడి ఉండచ్చు. అంతేగాక "వగ" కి "శృంగార చేష్ట", "ఆలోచన" అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఘంటసాల పాడిన మూడు చరణాలే గమనిస్తే ఈ అర్థం కూడా బాగా పొసుగుతుంది. వెంకటరత్నం గారు వ్రాసిన పాట పూర్తి పాఠం చదివినప్పుడు మాత్రం "చింత" అనే అన్వయించుకోవాలి.




రావోయి బంగారిమావా!
నీతోటి రహస్యమొకటున్నదోయీ,
రావోయి బంగారిమావా!

నీళ్ళ తూరలవెన్క
నిలుచున్నపాటనే
జలజలల్ విని గుండె
ఝల్లుమంటున్నాది ,
రావోయి బంగారి మావా!

అవిసె పూవులు రెండు
అందకున్నయి నాకు
తుంచి నా సిగలోన
తురిమి పోదువుగాని,
రావోయి బంగారి మావా!

ఏటి పడవ సరంగు
పాట గిరికీలలో
చెలికాడ మన సొదల్
కలబోసుకొందాము
రావోయి బంగారి మావా!

బహుదూరపు బాటసారీ!

రచన: ఘంటసాల (?)
స్వరకల్పన: ఘంటసాల
పాడినది: ఘంటసాల




మృతి అంటే భయం లేనటువంటి వ్యక్తి పాడుతున్న పాట:

బహుదూరపు బాటసారీ! ఇటు రావో ఒక్కసారీ!

బహుదూరపు బాటసారీ! ఇటు రావో ఒక్కసారీ!
బహుదూరపు బాటసారీ! ఇటు రావో ఒక్కసారీ!

అర్థరాత్రి పయనమేలనోయి? పెనుతుఫాను రేగనున్నదోయి!
అర్థరాత్రి పయనమేలనోయి? పెనుతుఫాను రేగనున్నదోయి!
నా కుటీరమిదేనోయ్, విశ్రమింపరావోయి,
నా కుటీరమిదేనోయ్, విశ్రమింపరావోయి,
- వేకువనే పోదమోయ్
బహుదూరపు బాటసారీ! ఇటు రావో ఒక్కసారీ!

పయనమెచటికోయి, నీ పయనమెచటికోయి?
నీ దేశమేనటోయి?
నా ఆశలు తీరెనోయి, నీతో గొని పోవోయి,
నా ఆశలు తీరెనోయి, నీతో గొని పోవోయి,
బహుదూరపు బాటసారీ! ఇటు రావో ఒక్కసారీ!

బాటసారీ! ఒక్కసారీ!

September 17, 2007

అంజలి, బీదపూజ



రచన: 'కరుణశ్రీ' జంధ్యాల పాపయ్య శాస్త్రి
స్వరకల్పన: ఘంటసాల
పాడినది: ఘంటసాల




(అంజలి)
పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెకు పాలు పోసి పో్సి -
పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెకు పాలు పోసి పో్సి -
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకులతికి అతికి -
పూల కంచాలలో రోలంబములకు
రేపటి భోజనము సిద్ధపరచి, పరచి -
తెలవారకుండ మొగ్గలలో జొరబడి
వింతవింతల రంగు వేసి వేసి -
తీరికే లేని విశ్వసంసారమందు
అలసిపోయితివేమొ దేవాధిదేవా!
దేవాధిదేవా!
ఒక్క నిమేషమ్ము
కన్నుమూయుదువు గాని రమ్ము, రమ్ము
తెరచితి నా కుటీరమ్ము తలుపు

(బీదపూజ)
కూర్చుండ మాయింట కురిచీలు లేవు,
నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి;
పాద్యమ్ములిడ మాకు పన్నీరు లేదు,
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి.
పూజకై మా వీట పుష్పాలు లేవు,
నా ప్రేమాంజలులె సమర్పించనుంటి;
నైవేద్యమిడ మాకు నారికేళము లేదు,
హృదయమే చేతికందీయనుంటి!
లోటు రానీయనున్నంతలోన నీకు,
రమ్ము! దయచేయుమాత్మ పీఠమ్ము పైకి,
అమృత ఝరి చిందు నీ పదాంకములయందు
కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రీ!


బుజ్జాయి: ఆవుదూడ; రోలంబము: తుమ్మెద; వీట: ఇంట్లో; ఝరి: నది; పాద్యము: కాళ్ళు కడుగుకొనేందుకు నీళ్ళు; ప్రణయాంకము: ప్రణయ (ప్రార్థన) + అంకము (వొడి ); పదాంకము: పద (అడుగు) + అంకము (జాడ)