September 17, 2007

అంజలి, బీదపూజ



రచన: 'కరుణశ్రీ' జంధ్యాల పాపయ్య శాస్త్రి
స్వరకల్పన: ఘంటసాల
పాడినది: ఘంటసాల




(అంజలి)
పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెకు పాలు పోసి పో్సి -
పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెకు పాలు పోసి పో్సి -
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకులతికి అతికి -
పూల కంచాలలో రోలంబములకు
రేపటి భోజనము సిద్ధపరచి, పరచి -
తెలవారకుండ మొగ్గలలో జొరబడి
వింతవింతల రంగు వేసి వేసి -
తీరికే లేని విశ్వసంసారమందు
అలసిపోయితివేమొ దేవాధిదేవా!
దేవాధిదేవా!
ఒక్క నిమేషమ్ము
కన్నుమూయుదువు గాని రమ్ము, రమ్ము
తెరచితి నా కుటీరమ్ము తలుపు

(బీదపూజ)
కూర్చుండ మాయింట కురిచీలు లేవు,
నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి;
పాద్యమ్ములిడ మాకు పన్నీరు లేదు,
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి.
పూజకై మా వీట పుష్పాలు లేవు,
నా ప్రేమాంజలులె సమర్పించనుంటి;
నైవేద్యమిడ మాకు నారికేళము లేదు,
హృదయమే చేతికందీయనుంటి!
లోటు రానీయనున్నంతలోన నీకు,
రమ్ము! దయచేయుమాత్మ పీఠమ్ము పైకి,
అమృత ఝరి చిందు నీ పదాంకములయందు
కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రీ!


బుజ్జాయి: ఆవుదూడ; రోలంబము: తుమ్మెద; వీట: ఇంట్లో; ఝరి: నది; పాద్యము: కాళ్ళు కడుగుకొనేందుకు నీళ్ళు; ప్రణయాంకము: ప్రణయ (ప్రార్థన) + అంకము (వొడి ); పదాంకము: పద (అడుగు) + అంకము (జాడ)

No comments: