Showing posts with label విరహం. Show all posts
Showing posts with label విరహం. Show all posts

April 14, 2011

ఊరు లేని పొలిమేర, పేరు-పెంపు లేని బదుకు, గారవంబులేని ప్రియము, కదియనేటికే?

రచన: అన్నమయ్య

కల్లూరి మురళీకృష్ణ గారు ఈ పాటకి వరస కట్టి పాడారు కానీ అది ఏమాత్రమూ పండలేదు. బాలమురళిగారు చెప్పినట్టు, ఎంతోమంది అన్నమయ్య పదాలకు వరసలు అమర్చారు కానీ, అవి ఆలోచనామృతములుగానే మిగిలిపోయాయి; ఆపాతమధురాలు కాలేదు. ఈ పాట కూడా ఆ కోవలోనే జేరింది - ప్రస్తుతానికి.


ఊరు లేని పొలిమేర, పేరు-పెంపు లేని బదుకు,
గారవంబులేని ప్రియము, కదియనేటికే?

ఉండరాని విరహవేదనయుండని సురతసుఖమేల?
ఎండలేనినాటి నీడ ఏమి సేయనే?
దండిగలుగుతమకమనేటి దండలేని తాలిమేల?
రెండునొకటిగాని రచనప్రియములేటికే?

మెచ్చులేనిచోటు ఎంత మేలు కలిగినేమి శెలవు
మచ్చికలేనిచోట మంచి మాటలేటికి?
పెచ్చు-పెరుగు లేనిచోటబ్రియము కలిగినేమి ఫలము?
ఇచ్చలేనినాటి సొబగులేమిసేయనే?

బొంకులేనిచెలిమిగాని పొందులేల మనసులోన?
శంకలేకగదియలేని చనవులేటికే?
కొంకు-కొసరు లేని మంచి కుటమలరనిట్లగూడి
వేంకటాద్రి విభుడులేని వేడుకేటికే?

ఊరు లేని పొలిమేర: ఊరు లేనప్పుడు/లేనిచోట  పొలిమేర; గారవంబు: గారం; కదియ: కలియ; ఉండరాని విరహవేదన: అలవిగాని విరహవేదన; దండి: సమృద్ధి; తమకము: అనురక్తి; తాలిమి: ఓర్పు, క్షమ; మచ్చిక: ప్రేమ; రచనప్రియము: తెచ్చిపెట్టుకున్న (కృతికమైన) ప్రేమ, కల్లబొల్లి కబుర్లు; మంచి: మిక్కిలి (మచ్చికలేని చోట మంచి మాటలు వద్దంటే అర్ధం తగవులాడమని కాదు,అవసరానికి మించి మాట్లాడ వద్దని); కొంకు-కొసరు లేని: ఏ మాత్రం భయము, సంకోచము లేని

September 24, 2007

రావోయి బంగారిమావా!

రచన: కొనకళ్ళ వెంకటరత్నం (బంగారిమావ పాటలు)
స్వరకల్పన: ఘంటసాల
పాడినది: ఘంటసాల

వెంకటరత్నం గారు రాసిన పాటలో మూడు చరణాలు మాత్రమే ఘంటసాల గారు పాడారు.
ఘంటసాల "వగ" అని పాడారని డొక్కా ఫణి వ్యాఖ్య. నిజమే. "సొద", "వగ" "చింత" కు పర్యాయపదాలే కాబట్టి అర్థ గౌరవం తగ్గదు; కానీ "సొద" కి  "సోది" అనే (అనైఘంటిక) విపరీతార్థమే ఎక్కువ ప్రాచుర్యం పొంది ఉండటం వల్ల ఘంటసాల "వగ" అని పాడి ఉండచ్చు. అంతేగాక "వగ" కి "శృంగార చేష్ట", "ఆలోచన" అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఘంటసాల పాడిన మూడు చరణాలే గమనిస్తే ఈ అర్థం కూడా బాగా పొసుగుతుంది. వెంకటరత్నం గారు వ్రాసిన పాట పూర్తి పాఠం చదివినప్పుడు మాత్రం "చింత" అనే అన్వయించుకోవాలి.




రావోయి బంగారిమావా!
నీతోటి రహస్యమొకటున్నదోయీ,
రావోయి బంగారిమావా!

నీళ్ళ తూరలవెన్క
నిలుచున్నపాటనే
జలజలల్ విని గుండె
ఝల్లుమంటున్నాది ,
రావోయి బంగారి మావా!

అవిసె పూవులు రెండు
అందకున్నయి నాకు
తుంచి నా సిగలోన
తురిమి పోదువుగాని,
రావోయి బంగారి మావా!

ఏటి పడవ సరంగు
పాట గిరికీలలో
చెలికాడ మన సొదల్
కలబోసుకొందాము
రావోయి బంగారి మావా!