Showing posts with label రజనీకాంత రావు. Show all posts
Showing posts with label రజనీకాంత రావు. Show all posts

July 14, 2011

మన ప్రేమ

రచన: బాలాంత్రపు రజనీకాంతరావు
స్వరకల్పన: బాలాంత్రపు రజనీకాంతరావు
పాడినది: శ్రీరంగం గోపాలరత్నం, మంగళంపల్లి బాలమురళికృష్ణ

ప్రేమికుల ఆశలు, ఆందోళనలకు అద్దం పట్టే పాట ఇది.



Audio - శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారి సౌజన్యంతో.


మన ప్రేమ, మన ప్రేమ!


సత్య సౌందర్య భూములలో ప్రభవించి, ప్రభవించి
- నమ్రమరుసీమమగునో!
- కమ్రసుమధామమగునో!


కల్లొలినీ తరంగములన్ పయనించి, పయనించి
- కీర్ణసికతాద్రియగునో!
- పూర్ణకలశాబ్ధియగునో!


కాలగాఢాగ్నికీలలలో తపియించి, తపియించి
- దగ్ధతరుకాండమగునో!
- ముగ్ధమధుభాండమగునో!

ప్రభవించి : పుట్టి; ప్రభవించి : పెరిగి; నమ్రమరుసీమ : నమ్ర + మరు + సీమ - తుచ్చమైన ఎడారి; కమ్రసుమధామము: కమ్ర (అందమైన) + సుమధామము (పూదోట); కల్లొలినీ: నది; పయనించి: ప్రయాణానికి సిద్ధమై; పయనించి: ప్రయాణించి; కీర్ణసికతాద్రియగునో:కీర్ణ (కప్పబడి) + సికతాద్రి (ఇసుకదిబ్బ) + అగునో - ఇసుకదిబ్బలచే కప్పబడిపోవునో; పూర్ణకలశాబ్ధియగునో: పూర్ణ + కలశ + అబ్ధి + అగునో - సముద్రంలో కలిసిన నది వలె సంపుర్ణమగునో; తపియించి: బాధపడి; తపియించి: తపస్సు చేసి; దగ్ధతరుకాండమగునో: కాలి మోడైపోవునో; ముగ్ధమధుభాండమగునో: ముగ్ధ (అందమైన) + మధుభాండము (తేనెలు గలది) - అనగా అందమైన పూలచెట్టు గా మారునో

May 20, 2011

స్వతంత్రభారతజననీ! నీకిదే నితాంత నవనీరాజనము

రచన:  బాలాంత్రపు రజనీకాంతరావు
స్వరకల్పన: బాలాంత్రపు రజనీకాంతరావు
పాడినది: శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, రామడుగు లక్ష్మీనారాయణవరప్రసాద శాస్త్రి, యమ్వీ రమణమూర్తి, తదితరులు


స్వతంత్రభారతజననీ! నీకిదే
నితాంత నవనీరాజనము
అశేష పుజాశిరీషములతో
అగణిత నరనారీ జనము

వదలెను చిరదాస్యశృంఖలమ్ములు
చెదరెను దైన్య-తమ:పటలమ్ములు
ఆసేతుహిమనగమ్మొక పొంగై
అలముకొన్నదానందతరంగము

పచ్చనితోటలనేయెడవినిన
స్వేచ్ఛాపికముల నిండుగళమ్ములు
హాయిహాయిగా రెక్కలు విద్రుచే
తీయని గీతిక హారతులే

త్యాగమూర్తియౌ మహాత్ముడొసగిన
శాంత్యహింసలే సదాశయములుగ
సకల వసుంధరనేకముసేయగ
అకలంకులమై ప్రతినలు సేతుము

పచ్చనితోటలనేయెడవినిన: పచ్చని తోటలలో ఏ ఎడ (ఎక్కడ) విన్నా; విద్రుచే: విదిలించే; అకలంకులమై: కళంకము లేని వారమై

February 9, 2011

చల్లగాలిలో యమునాతటిపై శ్యామసుందరుని మురళి

రచన: బాలాంత్రపు రజనీకాంత రావు
స్వరకల్పన: సాలూరు రాజేశ్వర రావు
పాడినది: సాలూరు రాజేశ్వర రావు

ఆలోచనామృతమును ఆపాతమధురంగా అందించగల బయకారులలో ఎన్నదగిన వ్యక్తి రజనీకాంతరావు గారు. ఆయన్ని గురించి తెలుసుకోవాలంటే అజో-విభొ-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా వైజయంతి చదవండి.




చల్లగాలిలో యమునాతటిపై
శ్యామసుందరుని మురళి!
మురళి, శ్యామసుందరుని మురళి

ఉల్లము కొల్లగొనే మధుగీతులు
మెల్లమెల్ల చెవి సోకునవే
చల్లగాలిలో!

తూలి వ్రాలు వటపత్రమ్ములపై
తేలి తేలి పడు అడుగులవే!
పూలతీవ పొదరిల్లు మాటు గా
పొంచిచూచు శిఖి పింఛమదే
చల్లగాలిలో!

తరువు తరువు కడ డాగి డాగి
నన్నరయు కన్నుగవ మురుపులవే
మురిసి మురిసి, నా వెనుక దరిసి
కనుమూయు చివురు కెంగేళులివే
మూయు చివురు కెంగేళులివే
చల్లగాలిలో యమునాతటిపై
శ్యామసుందరుని మురళి!
మురళి, శ్యామసుందరుని మురళి

అరయు: గమనించు; డాగి: దాగి; కన్నుగవ: కనుదోయి, (రెండు) కళ్ళు; మురుపు: సంతోషాతిశయము; కెంగేలు: కెంపు+కేలు - అరచెయ్యి