Showing posts with label దేవులపల్లి కృష్ణశాస్త్రి. Show all posts
Showing posts with label దేవులపల్లి కృష్ణశాస్త్రి. Show all posts

June 5, 2011

కడచేనటే సకియా, ఈ రాతిరి

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
స్వరకల్పన: వోలేటి వెంకటేశ్వర్లు
పాడినది: వోలేటి వెంకటేశ్వర్లు

ఇది ద్వంద్వార్థం కలిగిన పాట. నాయిక విరహం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ, అసలు అర్థం సాధకుడి ఆధ్యాత్మిక వేదన వ్యక్తం చేస్తుంది.

దీని పుట్టుక గురించి మహాభాష్యం చిత్తరంజన్ గారి పుస్తకం లో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు - ఆయన మాటల్లోనే చదవండి:

ఈ పాట ఆవిర్భావించటానికి ప్రేరణ కలిగించిన సందర్భం 1964 లో జరిగింది. అ సంవత్సరం జూలై ప్రాంతంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు స్థానిక రవీంద్ర భారతిలో ప్రదర్శించటానికి వర్షఋతువుకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. విజయవాడ కేంద్రం లో ప్రొడ్యుసర్ గా ఉన్న శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగానే నేను శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇంటిలో ఉండగా వోలేటి గారక్కడికి వచ్చారు.

అదే సమయం లో కృష్ణశాస్త్రి గారి కుమారుడు శ్రీ బుజ్జాయి తను కొత్తగా కొని తెచ్చుకున్న హిందుస్తాని ఎల్పీ రికార్డును పక్క గదిలో వింటుండగా శాస్త్రిగారి వద్ద కూర్చున్న మా చెవులలో పడింది. అందరం అ గది లోకి వెళ్లి విన్నం. అది పాకిస్తాన్ లోని విద్వాంసులు సలామత్ అలీ, నజాకత్ అలీ గానం చేసిన పహాడీ రాగపు ఠుమ్రి - "సయ్యా బిన్ ఘర సునా". వోలేటి వారు నాలుగైదు సార్లు అ రికార్డు పదే పదే వేయించుకు విని పరవశులైపోయారు.

హిందుస్తాని సంగీతం లో కుడా మహా విద్వాంసులైన వోలేటి గారు అ పారవశ్యంలో అరగంట సేపు పహాడీ రాగం ఆలపించారు. కృష్ణశాస్త్రి గారు తానొక పాట వ్రాస్తానని, వోలేటి గారిని బాణీ కట్టమని అడిగారు. వెంటనే వోలేటి గారు స్పందించగా రూపొందిన సుమధుర గేయమే ఈ "కడచేనటే సకియా ఈ రాతిరి". రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమం లో వోలేటి ఈ పాటను అద్భుతంగా గానం చేశారు.



Audio - శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారి సౌజన్యంతో.

చిత్తరంజన్ గారు చెప్పిన ఎల్పీ రికార్డు - ఇదే:




కడచేనటే సకియా, ఈ రాతిరి
కడుభారమైన ఎడబాటున
అయ్యయ్యో!

ఈ మేఘవేళ ఏమోకదే చెలియా!
స్వామి దవ్వైన, నిదుర రాదాయెనే
అయ్యయ్యో!

ఈ కడిమివోలె ఎదురుచూచేనే సకియా!
ఏకాకి నా బ్రతుకు చేదాయెనే
అయ్యయ్యో!

మేఘవేళ: మబ్బు పట్టి ఉన్న వేళ - మాయ కమ్మియున్న వేళ; ఏమొకదే: ఎమీ + ఓకదే (కనిపించదే); దవ్వైన: దవ్వు (దూరం) + అయిన; కడిమి: పచ్చిక బయలు - "కడిమివోలె ఎదురుచూచేనే" అంటే స్వామి పాదస్పర్శకై ఎదురుచూస్తున్నాను అని భావార్థం - ఇక్కడ "కడిమి" అనే పదం "కడిమిడి" కి రూపాంతరం అని నా అభిప్రాయం (చూ|| బ్రౌణ్యం)

January 18, 2011

జయ భారతావనీ! జయ లోకపావనీ! (జయ గీతి)

రచన;వానమామలై వరదాచార్యులు
స్వరకల్పన: నూకల చిన్న సత్యనారాయణ
పాడినది: ?


జయ భారతావనీ! జయ లోకపావనీ!
శాంతి సుఖదాయినీ! జననీ, నమస్తే!

సకల సంపత్ఖనీ! సస్య నందనవనీ!
ఆసేతుశీతనగహాటకావనీ! జననీ!

నీ మహోన్నతి - హిమానీగోత్ర శిఖరం
నీ పవిత్రత - గాంగనిర్ఝర ప్రవాహం
నీ చేతి సొమ్ము - ఎల్లోరా శిల్పఖండమ్ము
నీదు వాక్యమ్ము - శ్రీ గీతోపదేశం!


జయ భారతావనీ! జయ లోకపావనీ!
శాంతి సుఖదాయినీ! జననీ, నమస్తే!
ఆసేతుశీతనగహాటకావనీ: ఆసేతు + శీతనగ + హాటక + అవనీ - రామేశ్వరం (సేతు) నించి హిమాలయ పర్యంతంగా గల బంగరు (హాటక) భూమి;
హిమానీగోత్ర: గంగోత్రి; గాంగనిర్ఝర: గంగా నది

January 16, 2011

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
స్వరకల్పన: పాలగుమ్మి విశ్వనాథం (?)
పాడినది: బృందం
ఆకాశవాణి ఆణిముత్యం - గుర్తు చేసిన మిత్రుడు డొక్కా ఫణికుమారునికి కృతజ్ఞతలతో 

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఎల్లరికనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో


కొండదిగీ కోన దిగీ గుబురు అడవి కొమ్మలను దిగీ
ఉండి ఉండి ఒక ఇన కిరణమ్ము ఉర్వి ప్రభాతమ్ము నింపగా

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో


ఊరక చీకటి యవనిక లో ఒక్క క్షణం దాచారో ఎవరో
వారిక తారక దీపికనూ ఆరుపనేరుతురో ఎవరో

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో


ఈ సత్యాన్వేషికి, ఈ మితభాషికి ఎంత కాలమీ బంధన?
ఈ అసత్యాలలో దైవానికి ఎంత కాలమీ శోధన?


తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఎల్లరికనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో

ఇన కిరణము: సూర్య కిరణము; ఉర్వి: భూమి; యవనిక: తెర చీర, పరదా;

January 14, 2011

తరలి రారమ్మా!

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
స్వరకల్పన: నూకల చిన్న సత్యనారాయణ ?

ఈ పాట రికార్డింగ్ నేనెప్పుడూ వినలేదు - మా అమ్మకి చిన్నసత్యనారాయణ గారు గురువు; అయన దగ్గర మా అమ్మ నేర్చుకుంది; నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను.

తరలి రారమ్మా! తరలి రారమ్మా!
గౌతమీ, మంజీర, ఓ నాగావళీ, ఓ వంశధారా,
తుంగభద్ర, పినాకినీ, ఉత్తుంగ భంగా కృష్ణవేణీ!
తరలి రారమ్మా! తరలి రారమ్మా!

నురుగుల ముత్యాల చెరగుల, తరగ మడతల పావడాతో
తురిమి సిగలో రెల్లు పూమంజరులు ఝారులౌ సోయగముతో
తరలి రారమ్మా! తరలి రారమ్మా!

ఆవలి దరి ఎలమావి తోపులు, ఇవలి దరి వరిచేల కోపులు
ఆవల ఈవల చూచుచూ, తలలూచుచూ, రాయంచ నడకల
తరలి రారమ్మా! తరలి రారమ్మా!

చెరగు: అంచు; తరగ: అల; మంజరి: చిగిరించిన లేతకొమ్మ, పూలగుత్తి, పెద్ద ముత్యము; ఝరి: సెలయేరు; సోయగము: అందము;  ఎల: లేత; వరి కోపులు: వరి మడులు; రాయంచ: రాజహంస