May 30, 2011

అందాల ఆమనీ! ఆనందదాయనీ!


రచన:  ???
స్వరకల్పన: మల్లాది సూరిబాబు or కలగా కృష్ణ మోహన్
పాడినది: విజయలక్ష్మి



Audio - శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారి సౌజన్యంతో.


అందాల  ఆమనీ!  ఆనందదాయనీ!
అరుదెంచినావటే అప్సరాగామినీ!

గండుకోయిల నీదు గళమందు పాడినది
నిండు పండువ నీదు గుండెలో దాగినది

పువ్వులే నవ్వులుగా పులకించిపోదువా?
నవ్వులే వెన్నెలగా నన్ను మురిపింతువా?

యుగయుగాలుగా కవుల ఊరించు రసధునీ!
మధురార్ద్రహృదయినివే మాధవుని భామిని


May 20, 2011

స్వతంత్రభారతజననీ! నీకిదే నితాంత నవనీరాజనము

రచన:  బాలాంత్రపు రజనీకాంతరావు
స్వరకల్పన: బాలాంత్రపు రజనీకాంతరావు
పాడినది: శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, రామడుగు లక్ష్మీనారాయణవరప్రసాద శాస్త్రి, యమ్వీ రమణమూర్తి, తదితరులు


స్వతంత్రభారతజననీ! నీకిదే
నితాంత నవనీరాజనము
అశేష పుజాశిరీషములతో
అగణిత నరనారీ జనము

వదలెను చిరదాస్యశృంఖలమ్ములు
చెదరెను దైన్య-తమ:పటలమ్ములు
ఆసేతుహిమనగమ్మొక పొంగై
అలముకొన్నదానందతరంగము

పచ్చనితోటలనేయెడవినిన
స్వేచ్ఛాపికముల నిండుగళమ్ములు
హాయిహాయిగా రెక్కలు విద్రుచే
తీయని గీతిక హారతులే

త్యాగమూర్తియౌ మహాత్ముడొసగిన
శాంత్యహింసలే సదాశయములుగ
సకల వసుంధరనేకముసేయగ
అకలంకులమై ప్రతినలు సేతుము

పచ్చనితోటలనేయెడవినిన: పచ్చని తోటలలో ఏ ఎడ (ఎక్కడ) విన్నా; విద్రుచే: విదిలించే; అకలంకులమై: కళంకము లేని వారమై

May 19, 2011

నా దేశం - నవ్వుతున్న నందనాల సుమగీతం

రచన:  మంగళగిరి ఆదిత్యప్రసాద్
స్వరకల్పన: అనిపిండి (రామడుగు) మీనాక్షి
పాడినది: ???
శ్రీమతి అనిపిండి మీనాక్షి గారికి కృతజ్ఞతలతో.


నా దేశం - నవ్వుతున్న నందనాల సుమగీతం
నా దేశం - వేదంలా తారాడే సంగీతం
నవయువకుల నాడినుండి, నవశక్తుల నీడనుండి,
ఎదలూయలలూగుతున్న ఉదయకాంతి జలపాతం

యుగాలైన కరగిపోని ఘనతకిల్లు నా దేశం!
యుగకర్తల, సంస్కర్తల, ఘనులకిల్లు నా దేశం!
అడుగడుగున సందేశం, అణువణువున ఆవేశం!
నా భారత దేశానికి సాటి రాదు ఏ దేశం!

కులమతాల కోకిలలకు గున్నమావి నా దేశం!
బాధితులను ఓదార్చే బోధితరువు నా దేశం!
మురిపించే దరహాసం, మరపించే మధుమాసం!
ధరకంతకు ప్రాణమిచ్చు సురభోజం నా దేశం!

సురభోజం: దేవతల రాజ్యం

May 18, 2011

కలగంటిని, నేను కలగంటిని

రచన: మధురాంతకం రాజారామ్
స్వరకల్పన: ???
పాడినది: రామడుగు లక్ష్మీనారాయణవరప్రసాద శాస్త్రి (ఆకాశవాణి - విజయవాడ కేంద్రం)

లక్ష్మీనారాయణవరప్రసాద శాస్త్రి గారి కుమార్తె శ్రీమతి అనిపిండి మీనాక్షి గారికి కృతజ్ఞతలతో.


కలగంటిని, నేను కలగంటిని
కలలోన తల్లిని కనుగొంటిని

మెడలోన అందాల మందారమాల,
జడలోన మల్లికాకుసుమాల హేల!
ఆ మోములో వెల్గు కోటి దీపాలు,
ఆ తల్లి పాదాలు దివ్యకుసుమాలు!

కంచి కామాక్షియా? కాకున్న, ఈమె
కాశీ విశాలాక్షి కాకూడదేమి?
కరుణించి చూసెనా, వెన్నెలలు కురియు!
కన్నెర్ర జేసెనా, మిన్నులే విరుగు!

పోల్చుకున్నానులే, పోల్చుకున్నాను!
వాల్చి మస్తకము, నే ప్రణమిల్లినాను!
అనుపమానాలోక్య భాగ్యస్తమోపేత
ఆమె ఎవరో కాదు, భారతమాత!

మిన్ను: ఆకాశం; మస్తకము: నుదురు; ప్రణమిల్లినాను: దణ్ణం పెట్టాను; అనుపమానాలోక్య భాగ్యస్తమోపేత: అనుపమాన + ఆలోక్య + భాగ్యస్తమోపేత = చూసి ఆనందించడమే తప్ప చెప్పనలవిగాని భాగ్యములు కల్గిన