April 14, 2011

ఊరు లేని పొలిమేర, పేరు-పెంపు లేని బదుకు, గారవంబులేని ప్రియము, కదియనేటికే?

రచన: అన్నమయ్య

కల్లూరి మురళీకృష్ణ గారు ఈ పాటకి వరస కట్టి పాడారు కానీ అది ఏమాత్రమూ పండలేదు. బాలమురళిగారు చెప్పినట్టు, ఎంతోమంది అన్నమయ్య పదాలకు వరసలు అమర్చారు కానీ, అవి ఆలోచనామృతములుగానే మిగిలిపోయాయి; ఆపాతమధురాలు కాలేదు. ఈ పాట కూడా ఆ కోవలోనే జేరింది - ప్రస్తుతానికి.


ఊరు లేని పొలిమేర, పేరు-పెంపు లేని బదుకు,
గారవంబులేని ప్రియము, కదియనేటికే?

ఉండరాని విరహవేదనయుండని సురతసుఖమేల?
ఎండలేనినాటి నీడ ఏమి సేయనే?
దండిగలుగుతమకమనేటి దండలేని తాలిమేల?
రెండునొకటిగాని రచనప్రియములేటికే?

మెచ్చులేనిచోటు ఎంత మేలు కలిగినేమి శెలవు
మచ్చికలేనిచోట మంచి మాటలేటికి?
పెచ్చు-పెరుగు లేనిచోటబ్రియము కలిగినేమి ఫలము?
ఇచ్చలేనినాటి సొబగులేమిసేయనే?

బొంకులేనిచెలిమిగాని పొందులేల మనసులోన?
శంకలేకగదియలేని చనవులేటికే?
కొంకు-కొసరు లేని మంచి కుటమలరనిట్లగూడి
వేంకటాద్రి విభుడులేని వేడుకేటికే?

ఊరు లేని పొలిమేర: ఊరు లేనప్పుడు/లేనిచోట  పొలిమేర; గారవంబు: గారం; కదియ: కలియ; ఉండరాని విరహవేదన: అలవిగాని విరహవేదన; దండి: సమృద్ధి; తమకము: అనురక్తి; తాలిమి: ఓర్పు, క్షమ; మచ్చిక: ప్రేమ; రచనప్రియము: తెచ్చిపెట్టుకున్న (కృతికమైన) ప్రేమ, కల్లబొల్లి కబుర్లు; మంచి: మిక్కిలి (మచ్చికలేని చోట మంచి మాటలు వద్దంటే అర్ధం తగవులాడమని కాదు,అవసరానికి మించి మాట్లాడ వద్దని); కొంకు-కొసరు లేని: ఏ మాత్రం భయము, సంకోచము లేని